Sunday 15 January 2017

దిక్కులు దిశలు అధిపతులు / Vaastu ....

దిక్కులు దిశలు అధిపతులు

మనకు తెలిసిన ముఖ్యమైన నాలుగు దిశలు తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణం. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి మరియు వాయవ్య దిశలను విదిక్కులు అంటాము.

సూర్యునికి అభిముఖంగా తిరిగి సూర్యోదయ దిశగా ఉంటె ఆ దిశను తూర్పు అంటారు. అలా ఉండగా మన ఎడమ వైపు గల దిక్కును ఉత్తర దిశ అంటారు.

కుడివైపుకు ఉన్న దిక్కును దక్షిణము అని మరియు వెనక వైపు ఉన్న దిక్కును పడమర దిశగా పరిగణిస్తారు.

తూర్పుకు ఉత్తరానికి మధ్యన కల దిక్కును ఈశాన్యం అంటారు.

తూర్పుకు దక్షిణానికి మధ్యన కల దిక్కును ఆగ్నేయం అంటారు.

పడమరకు ఉత్తరానికి మధ్యగల దిక్కును వాయవ్యం అని అంటారు.

పడమరకు దక్షిణానికి మధ్య గల దిక్కును నైరుతి అని అంటారు.

ఇప్పుడు మనం వివిధ దిక్కులకు ఎవరెవరు అధిపతి అనే విషయాన్ని చూద్దాం.

తూర్పు దిక్కు    – అధిపతి ఇంద్రుడు

ఆగ్నేయ దిక్కు   – అధిపతి అగ్ని దేవుడు

దక్షిణ దిక్కు      – అధిపతి యముడు

నైరుతి దిక్కు     – అధిపతి నిరృతి

పడమర దిక్కు  – అధిపతి వరుణుడు

వాయవ్య దిక్కు – అధిపతి వాయువు

ఉత్తర దిక్కు      – అధిపతి కుబేరుడు

ఈశాన్య దిక్కు   – అధిపతి ఈశానుడు

తూర్పుముఖ ద్వారము ఉండడం వలన పుత్ర సంతానము, కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు మర్యాదలు కలుగును. ఇంట్లో తూర్పు దిక్కులో బరువులు ఉండడం అశుభం. కావున ఆ దిశలో బరువులు లేకుండా చూడాలి.

ఆగ్నేయమున అగ్నిదేవుడు  ఆహారము, దీర్గాయువు, ఆరోగ్యము లకు అధిపతియై ఉండడం చేత వంట, ఇంటి విద్యుత్ మెయిన్ బోర్డులు ఈ దిశగా ఉండడం సర్వ విధాలా శుభకరం. ఆగ్నేయం మూల బరువులు ఉండడం చేత అగ్ని భయాలు ప్రమాదాలు కలుగును కావున ఆగ్నేయ దిశగా బరువులు ఉంచరాదు.

దక్షిణ దిశకు యముడుఅధిపతి. యముడు న్యాయానికి సత్యానికి అధిపతిగా ఉండటం చేత అటువైపు తల పెట్టుకుని నిద్రించడం చేత ఆ ఇంటిలో నివసించేవారికి మంచి నడవడి, యోగ్యులైన మిత్రులు మరియు నిజాయితీ కలుగుతాయి. దక్షిణ దిశగా ఇంట్లో బరువు ఉండడం శుభం.

నైరుతికి రక్షకుడు నిరృతి కావడం చేత ఆ ఇంటి యజమాని ఆ దిక్కున ఉండడం శ్రేయస్కరం. ఇంట్లో బరువైన వస్తు సామాగ్రిని ఈ దిశగా ఉంచడం మంచిది.

నైరుతి దిశగా ఇంట్లో ఖాళీ స్థలం ఉండరాదు. ద్వారాలు మరియు బయట గేట్ కూడా ఈ దిశగా ఉండరాదు. నైరుతి దిశగా ఇంట్లో బరువు ఉండడం చేత శుభం మరియు ఆ ఇంటికి శత్రు భయం కూడా ఉండదు.

పడమర దిశకు అధిపతి వరుణుడు కావడం చేత ఇంట్లో స్త్రీ సంతాన వృద్ధి మరియు ఐశ్వర్య ప్రాప్తి కలుగును. ఈ దిశగా జీవించేవారు సాధారణంగా ఆధిపత్య స్థానాలలో ఉంటారు మరియు మిక్కిలి తెలివైనవారుగా ఉంటారు. ఇంట్లో ఈ దిక్కులో గేట్ లేదా మెట్లు ఉండడం శుభకరం. పడమర దిశలో ఇంట్లో బరువు ఉండడం చేత ఆ ఇంట్లో పశుగణాభివృద్ధి జరుగును.

వాయవ్య దిశకు అధిపతి వాయుదేవుడు. వాయుదేవుడు ఇంటి యజమానికి మంచి ఆలోచన మరియు మంచి కుటుంబాన్ని ఇస్తాడు. వాయవ్య దిశగా గేట్ ఉండకూడదు. వాయవ్య దిశలో ఇంట్లో బరువులు లేకపోతె ఇంట్లోనివారికి మంచి వర్తన, స్థిరత్వం కలుగుతుంది.

ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు ఐశ్వర్య కారకుడు. ఉత్తర దిశగా జీవించేవారికి మంచి విద్య మరియు సంపద కలుగును. వీరు చాలా తెలివైనవారు మరియు ఉన్నత పదవులను చేపట్టేవారు అవుతారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉత్తర దిశ దర్శించుకోవడం శుభకరం. ఇంట్లో ఉత్తరం మూల బరువులు లేకపోవడం వలన ధనధాన్యాభివృద్ధి కలుగును.

ఈశాన్య దిశలో నివసించేవారు కార్య దీక్ష గలవారు మరియు విజయాలను సాధించేవారు అవుతారు. ఈ దిక్కు అన్ని దిక్కులలోకెల్లా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చును. అందుచేతనే ఇంట్లో ఈశాన్య దిశగా పూజా మందిరాన్ని ఉంచి పూజలు చేస్తారు. ఇంట్లో ఈశాన్యం మూల బరువులు లేకపోవడం సర్వ శుభకరం.🌹🌹🌹🌹

No comments:

Post a Comment