శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ?
మంగళవారం, చైత్ర పౌర్ణిమ, శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)
''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు,
హనుమంతుడు.
హిందూమతంలో ప్రాముఖ్యత :
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
హనుమంతుని నైజం
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.
భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. .(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.